mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 13 March 2026, 11:52 am Digital Edition : MAHAA PRABHA DAILY

చిన్నారికి తృటిలో తప్పిన ప్రమాదం! ఫోన్‌ చూస్తుండగా..

చార్జింగ్‌లో ఉన్న ఫోన్‌ పేలిన ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ప్రమాదం నుంచి ఒక చిన్నారి తృటిలో తప్పించుకుంది. చైనాలో ఈ ఘటన వెలుగు చూసింది.

ఇంటర్నెట్ డెస్క్ మార్చి 13 మహాప్రభ : మొబైల్ ఫోన్‌ పేలిన ఘటనలు ఇటీవల కాలంలో తరచూ వార్తల్లోకెక్కుతున్నాయి. వీటిల్లో అధిక శాతం ఘటనలు అజాగ్రత్త వల్లే జరుగుతున్నాయి. తాజాగా చైనాలో ఇలాంటి ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతంలో ఒక చిన్నారికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.వీడియోలో కనిపించిన దాని ప్రకారం, మొబైల్ ఫోన్ చార్జింగ్‌లో ఉండగా ఒక చిన్నారి దాన్ని చేతిలో పట్టుకుని ఫోన్‌లో తనకు నచ్చినవేవో చూడసాగింది. ఇంతలో ఫోన్ ఒక్కసారిగా పేలడంతో మంటలు ఎగసిపడ్డాయి. దీంతో, కంగారు పడిపోయిన బాలిక ఫోన్‌ను కింద జారవిడిచింది. తనూ బ్యాలెన్స్ తప్పి సోఫా నుంచి కింద పడింది. తీవ్రభయాందోళనలకు లోనై పెద్ద పెట్టున అరిచింది. అయితే, ఈ ఘటనలో బాలికకు ఎలాంటి గాయాలు కానట్టు కనిపించింది. మరోవైపు, ఫోన్ మాత్రం మంటల్లో చిక్కుకుని కనిపించింది.

ఇక ఈ వీడియోపై జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఈ ఘటనతో చిన్నారి బాగా భయపడిపోయి ఉంటుందని అన్నారు. చార్జింగ్‌లో ఉన్న ఫోన్‌ను అస్సలు వాడొద్దని పలువురు చెప్పారు. చార్జింగ్ సమయంలో ఫోన్‌లోని బ్యాటరీ ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగితే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని అన్నారు. రాత్రిళ్లు ఫోన్‌ను పక్కనే పెట్టుకుని నిద్రపోయే వారికీ ఇలాంటి ప్రమాదం ఎదురు కావొచ్చని హెచ్చరించారు. నాసిరకం చార్జర్‌ల జోలికి వెళ్లొద్దని అన్నారు. పసిపిల్లలకు ఫోన్‌లను అస్సలు ఇవ్వొద్దని అన్నారు.