mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 10 March 2026, 7:02 am Digital Edition : MAHAA PRABHA DAILY

గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్.. మగపిల్లల జనన రేటు తగ్గుతుందా?

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మానవ జననాలపై కూడా ప్రభావం చూపవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. గర్భధారణ సమయంలో తల్లులు ఎదుర్కొనే అధిక వేడి కారణంగా మగ శిశువుల జనన రేటు తగ్గే అవకాశం ఉందని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. ముఖ్యంగా భారతదేశం, ఆఫ్రికా దేశాల్లో ఈ ప్రభావం కనిపిస్తున్నట్లు అధ్యయనం తెలిపింది.

ఇంటర్నెట్ డెస్క్, మార్చి 10 మహాప్రభ : గ్లోబల్ వార్మింగ్ ప్రభావం కేవలం పర్యావరణానికే పరిమితం కాదు. అది మానవ జననాలపై కూడా ప్రభావం చూపవచ్చని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. గర్భధారణ సమయంలో తల్లులు ఎదుర్కొనే అధిక ఉష్ణోగ్రతలు పుట్టే శిశువు అబ్బాయా లేక అమ్మాయా అన్న విషయంపై పరోక్షంగా ప్రభావం చూపవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటీవల ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనం ప్రకారం, గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో జననాల లింగ నిష్పత్తి మారే అవకాశం ఉంది. ముఖ్యంగా భారతదేశం, ఆఫ్రికా దేశాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని పరిశోధనలో వెల్లడైంది.

ఉష్ణోగ్రతలు పెరిగితే మగ శిశువుల సంఖ్య తగ్గుతుందా?

ఈ అధ్యయనాన్ని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం సోషియాలజీ విభాగం, లెవర్‌హుల్మ్ సెంటర్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ పరిశోధనలో 33 ఆఫ్రికన్ దేశాలు, భారతదేశంలో దాదాపు 50 లక్షల జననాలను విశ్లేషించారు. పరిశోధన ప్రకారం, ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్‌కి మించినప్పుడు మగ శిశువుల జనన రేటు తగ్గే అవకాశం ఉంది. వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఆడ శిశువుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా పరిశోధన చెబుతోంది. మగ శిశువులు వేడి పరిస్థితులకు ఎక్కువగా ప్రభావితమవుతారని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఆఫ్రికాలో పరిస్థితి

ఉప సహారా ఆఫ్రికా ప్రాంతాల్లో గర్భధారణ మొదటి మూడు నెలల్లో అధిక ఉష్ణోగ్రతలకు గురయ్యే మహిళలు మగబిడ్డకు జన్మనిచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని అధ్యయనం తెలిపింది. దీనికి ప్రధాన కారణం ‘తల్లి వేడి ఒత్తిడి’. మగ శిశువులు సాధారణంగా వేడి, ఇతర ఒత్తిళ్లకు ఆడ శిశువుల కంటే ఎక్కువగా ప్రభావితమవుతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళల్లో, తక్కువ విద్య కలిగిన తల్లుల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించినట్లు అధ్యయనం వెల్లడించింది.

భారతదేశంలో పరిస్థితి ఎలా ఉంది?

భారతదేశంలో పరిస్థితి కొంత భిన్నంగా ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. ఇక్కడ సమాజంలో మగపిల్లలపై ఎక్కువ ప్రాధాన్యం ఉండటం వల్ల కొన్ని ప్రాంతాల్లో లింగ ఎంపిక గర్భస్రావాలు జరుగుతున్నాయి. పరిశోధన ప్రకారం, గర్భధారణ రెండవ దశలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు మగపిల్లల జనన రేటు తగ్గుతుంది. ముఖ్యంగా ఇప్పటికే పిల్లలు ఉన్న కుటుంబాల్లో లేదా మగపిల్లలు లేని కుటుంబాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని అధ్యయనం తెలిపింది.