mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 11:51 am Digital Edition : Namastey Mahaaprabha

కౌంటింగ్ వరకూ స్ట్రాంగ్ రూమ్‌లు తెరవద్దు.. ఈసీ కీలక ఆదేశాలు

కేరళలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల కమిషన్ మంగళవారంనాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓట్ల లెక్కింపు ముందువరకూ ఎట్టి పరిస్థితుల్లోనూ స్ట్రాంగ్ రూమ్‌లు తెరవరాదని ఆదేశాలిచ్చింది.

తిరువనంతపురం ఏప్రిల్ 21 (మహాప్రభ) : కేరళలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల కమిషన్ (Election Commission) మంగళవారంనాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓట్ల లెక్కింపు ముందువరకూ ఎట్టి పరిస్థితుల్లోనూ స్ట్రాంగ్ రూమ్‌లు తెరవరాదని ఆదేశాలిచ్చింది.

కోజికోడ్‌‌లోని పెరంబ్ర నియోజకవర్గంలో ఈవీఎంలు ఉంచిన స్ట్రాంగ్‌రూమ్‌ను తెరిచారని, పాలక్కాడ్‌లోని నెన్మర నియోజకవర్గంలో మరో స్ట్రాంగ్ రూమ్‌ను తెరిచేందుకు ప్రయత్నించారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కేరళ చీఫ్ ఎలక్టోరల్ అధికారి రతన్ యు కేల్కర్ తాజా ఆదేశాలు జారీ చేశారు. స్ట్రాంగ్‌రూమ్‌లు కానీ, సీల్‌వేయని రూములు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవవద్దని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ సమగ్రత, పారదర్శకత, భద్రతను పరిరక్షించేందుకు అధికారులంతా ఈ సూచనలను పాటించాలని కోరారు. కాగా, ఏ ఒక్క స్ట్రాంగ్ రూమ్‌ను తెరవలేదని కోజికోట్ జిల్లా యంత్రాంగం వివరణ ఇచ్చింది. పోలింగ్ రికార్డుల వెరిఫై, అప్‌డేట్ కోసం సీల్ చేయని మెటీరియల్ రూమ్‌ను అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో తెరిచినట్టు జిల్లా ఎన్నికల అధికారిగా కూడా ఉన్న కలెక్టర్ స్నేహిల్ కుమార్ సింగ్ తెలిపారు. బిల్డింగ్ మొదటి అంతస్తులోని సీల్ వేసిన గదిలో ఈవీఎంలు, వీవీపాట్‌లు ఉన్నాయని, కేంద్ర పరిశీలకులు, అభ్యర్థుల ఏజెంట్ల పర్వవేక్షణలో ఉన్న ఈ సీల్డ్ గదిని ఎవరూ తెరవలేదని చెప్పారు. 140 నియోజకవర్గాలున్న కేరళ అసెంబ్లీకి పోలింగ్ ఏప్రిల్ 9న జరిగింది. మే 4న ఫలితాలు వెలువడతాయి.