గడ్డి అన్నారం -18 ఫిబ్రవరి (మహాప్రభ) : గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్‌గా తన పదవీకాలం పూర్తి అయిన సందర్భంగా, బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి,ఈరోజు ఉదయం మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంపీ ఈటల రాజేందర్ విజయానంతరం గడ్డిఅన్నారం డివిజన్‌లో కోట్ల రూపాయల వ్యయంతో నూతన సీసీ రోడ్లు, స్ట్రామ్ వాటర్ నాలా పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. కౌన్సిల్ సమావేశాల్లో కేవలం భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లకే కాకుండా కౌన్సిల్‌లోని వివిధ రాజకీయ పార్టీలకు సమానంగా నిధులు కేటాయించాలని బలంగా వాదించిన నాయకుడు ఈటల రాజేందర్ తెలిపారు. డివిజన్ పరిధిలోని సమస్యలను అధికారులు దృష్టికి తీసుకెళ్లి, ప్రత్యేకంగా చర్చించి అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు.అదేవిధంగా కమలానగర్ కాలనీలో రోడ్ నెంబర్ 5 వద్ద గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సీఆర్‌ఎంపీ రోడ్ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే న్యూ గడ్డిఅన్నారం కాలనీ కమ్యూనిటీ అభివృద్ధికి ఎంపీ నిధుల ద్వారా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.ఇకపై కూడా గడ్డిఅన్నారం డివిజన్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రజలతో కలిసి పనిచేస్తానని, తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి ప్రాధాన్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని తెలిపారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం కొనసాగిస్తానని పేర్కొన్నారు.గడ్డిఅన్నారం డివిజన్ అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న ఎంపీ ఈటల రాజేందర్, బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.