mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 11:54 am Digital Edition : Namastey Mahaaprabha

కేసీఆర్‌ స్థాయి.. రేవంత్‌ స్థాయి ఏంటో ప్రజలకు తెలుసు: హరీశ్ రావు

కేసీఆర్‌ స్థాయి.. రేవంత్‌ స్థాయి ఏంటో ప్రజలకు తెలుసని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ వైపే ఉన్నారని తెలిపారు. జగిత్యాల సభలో కేసీఆర్‌ హుందాగా మాట్లాడారని చెప్పుకొచ్చారు.

హైదరాబాద్ ఏప్రిల్ 21 (మహాప్రభ) : జగిత్యాలలో బీఆర్‌ఎస్ సభ సమయానికే కాంగ్రెస్‌ సభ పెట్టడంపై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుందని సెటైర్లు వేశారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన హరీష్ రావు.. కేసీఆర్‌ స్థాయి ఏంటో, రేవంత్‌ స్థాయి ఏంటో ప్రజలకు తెలుసన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ వైపే ఉన్నారన్నారు. జగిత్యాల సభలో కేసీఆర్‌ హుందాగా మాట్లాడారని తెలిపారు. నిన్నటి సభలో రేవంత్‌ పేరును కేసీఆర్‌ లేవనెత్తారా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

రేవంత్‌ ఇప్పటికైనా హుందాగా మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో కనీసం డిపాజిట్లయినా దక్కుతాయని మాజీ మంత్రి హితవుపలికారు. మిగిలిన రెండున్నరేళ్లయినా మంచి పాలన అందించాలని సూచించారు. ‘నేను ఢిల్లీ వెళ్తే సీఎంవో నుంచి లీకులు ఇచ్చారు. విషయం లేనివారే ఇలాంటి ప్రచారాలు చేస్తారు. నా ఢిల్లీ పర్యటనలో ఎలాంటి దాపరికం లేదు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచే ఢిల్లీకి వెళ్లా. ఫిరాయింపుల కేసుపై చర్చించేందుకే ఢిల్లీ వెళ్లాం’ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ కుట్రలను ఎదుర్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు మాజీ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.