mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 24 February 2026, 11:44 am Digital Edition : Namastey Mahaaprabha

కెమెరా తిప్పకుండా, మైక్ కట్ చేయకుండా చర్చించే దమ్ము సీఎంకు ఉందా: హరీశ్ రావు

దేవాదుల ప్రాజెక్ట్ మొదటి ప్రాధాన్యమని చెప్తూనే పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. మంత్రుల మాటలకు, సీఎం మాటలకు పొంతన లేదన్నారు. దేవాదుల ప్రాజెక్ట్‌ను వెంటనే పూర్తి చేయాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.

వరంగల్, ఫిబ్రవరి 24 మహాప్రభ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై(CM Revanth Reddy) మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) మరోసారి విరుచుకుపడ్డారు. ఈ రోజు(మంగళవారం) వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను మాజీ మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్ట్‌ను తాము విజిట్ చేసిన వెంటనే సీఎం రివ్యూ చేశారని.. తాము తట్టిలేపితేనే సీఎం నిద్ర లేస్తున్నారని వ్యాఖ్యానించారు. దేవాదుల ప్రాజెక్ట్ మొదటి ప్రాధాన్యమని చెబుతూనే పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో ఒక్క ఎకరా భూమినీ సేకరించలేదని, సాగునీరూ అందించలేదని విమర్శించారు. మంత్రుల మాటలకు, సీఎం మాటలకు పొంతన లేదన్నారు. ఈ ప్రభుత్వానికి డేట్‌లు, డెడ్‌లైన్‌లు మాత్రమే మారుతున్నాయని హరీశ్ రావు అన్నారు.గోదావరి నీళ్లను పొలాలకు మళ్లించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. కాంగ్రెస్ ఏమీ చేయలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పేర్కొన్నారు. కెమెరా తిప్పకుండా, మైక్ కట్ చేయకుండా చర్చించే దమ్ము సీఎంకు ఉందా అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. దేవాదుల ప్రాజెక్ట్‌లో 90 శాతం పనులు పూర్తయ్యాయని, 10 శాతం మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని.. త్వరలో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పేదల కోసం కేసీఆర్ హెల్త్ సిటీ నిర్మిస్తే.. రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం రేవంత్ రెడ్డిదని.. పేదల కోసం పనిచేసే ఆలోచన కేసీఆర్‌ది అని ఆరోపించారు.

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిపై నిర్లక్ష్యం చేయవద్దని హరీశ్ రావు అన్నారు. కేసీఆర్‌కు పేరు వస్తుందని పనులు చేయట్లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యం కారణంగా ఆసుపత్రి ప్రారంభం కావట్లేదని విమర్శించారు. రెండేళ్లు ఓపిక పట్టామని.. ఇక నిలదీస్తామని, గల్లా పట్టి అడుగుతామని హెచ్చరించారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే బీఆర్ఎస్ నిరసన దీక్షలకు దిగుతుందని వార్నింగ్ ఇచ్చారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఏడాదిన్నరగా గుండె శస్త్ర చికిత్సలు ఆగిపోయాయని తెలిపారు. ఎంజీఎంలో 3 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు పెట్టామని, ఇప్పుడు ఒక్కటి కూడా పనిచేయట్లేదని ఆయన విమర్శలు గుప్పించారు.