కూకట్‌పల్లిలో భారీ దోపిడీ జరిగింది. నగదుతో వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల కళ్లలో కారం చల్లి.. నలుగురు వ్యక్తులు రూ. కోటి నగదుతో పరారయ్యారు. ఈ దోపిడీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..
పట్టుబడిన ముగ్గురు..
మరోవైపు ఈ కేసు దర్యాప్తులో భాగంగా నలుగురు నిందితుల్లో ముగ్గురిని మంగళవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు పట్టుకున్నారు. ఈ దోపిడీ అనంతరం వీరంతా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో పారిపోతుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ దొంగిలించిన సొమ్ము హవాలా నగదుగా పోలీసులు గుర్తించారు. బహుదూర్‌పురాకు చెందిన అమీర్ వద్ద ఖుస్రు, అజీముద్దీన్ మెకానిక్‌గా పని చేస్తున్నారు. సోమవారం సాయంత్రం 7.00 గంటలకు రూ. 10 నోటు ఇచ్చి పవన్‌ను కలవాలని వారికి అమీర్ సూచించారు.పవన్ నుంచి హవాలా నగదు తీసుకుని ఇబ్రహీం అనే వ్యక్తికి ఇవ్వాలని ఆదేశించారు. దాంతో ఖుస్రో బైక్‌పై అజీముద్దీన్ కూకట్‌పల్లి చేరుకుని పవన్‌ను సంప్రదించారు. పవన్ సూచన మేరకు పిల్లర్ నెం. 825 వద్ద గోకుల్ ఎన్‌క్లేవ్‌కు వెళ్లారు. వీరే అని నిర్ధారించుకున్న తర్వాత రూ.కోటి నగదు ఉంచిన కార్టన్ బాక్స్ వారికి అందజేశారు. అనంతరం వీరు పిల్లర్ నెంబర్ 848కి రమ్మని వారికి పవన్ ఫోన్ ద్వారా సూచించారు. అక్కడికి చేరుకునే సమయంలో వీరిద్దరిపై దుండగులు దాడి చేసి నగదు దోపిడి చేశారు. దీంతో చోరీ జరిగిన సమయం నుంచి కొన్ని గంటల్లోనే ఈ కేసును పోలీసులు ఛేదించారు.