తిరుపతి జిల్లాలో కారు ప్రమాదం నుంచి పలువురు ప్రయాణికులు తప్పించుకున్నారు. కారు నుంచి మంటలు చెలరేగే లోపే వాహనాన్ని దిగేసి పరుగులు తీయడంతో ప్రాణాలు దక్కాయి.
తిరుపతి జిల్లా ఏప్రిల్ 1 (మహాప్రభ) : చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్డులో పలువురు ప్రయాణికులకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వారంతా పరుగులు పెట్టారు. డ్రైవర్ అప్రమత్తతో ప్రాణాలు దక్కించుకున్నారు. తిరుపతి నుంచి పీలేరుకు కొంతమంది కారులో ప్రయాణిస్తున్నారు. చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్డు వద్దకు రాగానే కారు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగ రావడాన్ని డ్రైవర్ గమనించాడు. ప్రమాదం జరిగే అవకాశం ఉందన్న అనుమానంతో వెంటనే వాహనాన్ని ఆపేశాడు.
కారులో ప్రయాణిస్తున్న వారిని అప్రమత్తం చేశాడు. వారంతా కారు నుంచి బయటకు దిగి పరుగులు తీశారు. క్షణాల్లోనే వాహనంలో మంటలు చెలరేగాయి. కారు మెుత్తం పూర్తిగా దగ్ధమైంది. ఇది చూసిన ప్రయాణికులు తృటిలో ప్రాణాలు దక్కించుకున్నామని ఊపిరి తీసుకున్నారు. తోటి వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు ప్రమాదం గురించి వివరాలను అడిగి తెలుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, మంటలు ఏ విధంగా చెలరేగాయనే అంశం పూర్తి విచారణలో తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.