mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 23 February 2026, 7:10 am Digital Edition : Namastey Mahaaprabha

కామారెడ్డిలో కొనసాగుతున్న హై టెన్షన్..

కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతల మధ్య సవాళ్ల నేపథ్యంలో స్థానికంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

కామారెడ్డి, ఫిబ్రవరి 23 మహాప్రభ : కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతల మధ్య సవాళ్ల నేపథ్యంలో స్థానికంగా హైటెన్షన్ వాతావారణం నెలకొంది. సోమవారం జిల్లా కలెక్టర్‌తో బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి భేటీ కానున్నారు. తనపై చేసిన ఆరోపణల నేపథ్యంలో అందుకు సంబంధించిన సాక్ష్యాలు తీసుకురావాలంటూ కాంగ్రెస్ నేతలకు ఆయన సవాల్ విసిరారు. ఈ సవాల్‌ను కాంగ్రెస్ నేతలు స్వీకరించారు. అందుకు సంబంధించిన సాక్ష్యాలను కలెక్టర్ వద్దకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది.మరోవైపు డిగ్రీ కాలేజీ భూముల విషయంలో తాను అవినీతి చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని వెంకట రమణారెడ్డి ప్రకటించిన విషయం విదితమే. రాజీనామాకు సిద్ధం కావాలంటూ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నేతలు సవాల్ విసిరారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూములపై స్పష్టత ఇవ్వాలంటూ అధికారులను బీజేపీ డిమాండ్ చేసింది. ఇలా ఇరు పార్టీనేతల విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడంతో కామారెడ్డిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. ఇరు పార్టీల నేతలను కలెక్టర్ కార్యాలయానికి పోలీసులు వెళ్లనిస్తారా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యేకు మద్దతుగా కామారెడ్డి వెళ్లేందుకు యత్నించిన తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావును పోలీసులు ఆదివారం హౌస్ అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకుని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అదే విధంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కామారెడ్డి వెళ్తుండగా.. ఆయన్నూ పెద్దశంకర్‌పేట వద్ద అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించిన విషయం విదితమే.