mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 31 March 2026, 6:34 am Digital Edition : MAHAA PRABHA DAILY

కాంగ్రెస్‏లో ‘మార్కెట్‌’ మంటలు

నంగునూరు మండల కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్ల నియామకం పార్టీలో గ్రూపు రాజకీయాలకు తెరలేపింది.

  • మార్కెట్‌ పాలకవర్గ నియామకంలో రగడ
  • నియోజకవర్గ ఇన్‌చార్జి దిష్టిబొమ్మ దహనం
  • పనిచేసే కార్యకర్తలకే పట్టం కట్టారని మరొక వర్గం క్షీరాభిషేకం

నంగునూరు(మెదక్) మార్చి 31 (మహాప్రభ): నంగునూరు మండల కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్ల నియామకం పార్టీలో గ్రూపు రాజకీయాలకు తెరలేపింది. నియోజకవర్గ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ తీరును నిరసిస్తూ ఒక వర్గం ఆయన దిష్టిబొమ్మను దహనం చేయగా, నియామకాలను సమర్థిస్తూ మరో వర్గం క్షీరాభిషేకం చేయడం మండలంలో చర్చనీయాంశమైంది.

ఇటీవల ప్రభుత్వం నంగునూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా సీనియర్‌ నాయకులు దేవులపల్లి యాదగిరిని, వైస్‌ చైర్మన్‌గా యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు సాదుల పవన్‌ కుమార్‌తో పాటు మరో 16 మందిని డైరెక్టర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాలు మండల కాంగ్రె్‌సలో చిచ్చు పెట్టాయి. నియోజకవర్గ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ అమ్ముడుపోయారని, కష్టపడి పనిచేసిన తమ వర్గీయులకు అన్యాయం చేశారని మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు తప్పెట శంకర్‌, గ్రామ శాఖ అధ్యక్షుడు అనరాజుల నాగరాజు ఆరోపించారు.
హరికృష్ణ ఫ్లెక్సీని దహనం చేస్తూ నిరసన తెలిపారు. తక్షణమే ఆయనను ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తొలగించాలని అధిష్టానాన్ని డిమాండ్‌ చేశారు. మరోవైపు, నిజమైన కార్యకర్తలకు గుర్తింపు లభించిందని సాదుల పవన్‌ కుమార్‌, డైరెక్టర్‌ ఇమ్రాన్‌ నేతృత్వంలో రాజగోపాల్‌పేట చౌరస్తాలో హరికృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పార్టీ కోసం పనిచేసే వారికే పదవులు దక్కాయని వారు కొనియాడారు.