వన్యప్రాణుల సంరక్షణకు నిలయమైన కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని తాళ్లపేట రేంజ్ అటవీ ప్రాంతంలో ఒక చిరుత పులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే..
మంచిర్యాల, మార్చి14 మహాప్రభ : వన్యప్రాణుల సంరక్షణకు నిలయమైన కవ్వాల్ టైగర్ రిజర్వ్(Qawwal Tiger Reserve) పరిధిలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని తాళ్లపేట రేంజ్(Tallapet Range) అటవీ ప్రాంతంలో ఒక చిరుత పులి(Leopard) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన అటవీ శాఖ వర్గాల్లో కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న చిరుత కనిపించకపోవడంతో అప్రమత్తమైన అటవీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తాళ్లపేట రేంజ్ పరిధిలో చిరుత కళేబరాన్ని గుర్తించారు. ఈ ఘటనపై అటవీశాఖ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది వేటగాళ్ల పనిగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
దర్యాప్తులో భాగంగా అటవీ శాఖ ప్రత్యేక బృందాలు, అనుమానితుల కదలికలపై నిఘా పెట్టారు. పక్కా సమాచారంలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి చిరుత గోర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణుల అవయవాల స్మగ్లింగ్ ముఠాతో వీరికి ఏవైనా లింకులు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం (Wildlife Protection Act, 1972) ప్రకారం షెడ్యూల్-1 జాబితాలో ఉన్న చిరుతను వేటాడం తీవ్రమైన నేరం. పట్టుబడిన నిందితులపై కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.