mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 04 April 2026, 6:04 am Digital Edition : Namastey Mahaaprabha

ఓటర్ల జాబితాలో పేరు చేరుస్తామంటూ ‘లింక్‌’లు

ఓటరు జాబితా పేరు చేర్చుతామంటూ సెల్‌ఫోన్లకు వస్తున్న లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.

  • అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించిన సైబర్‌ క్రైం

చెన్నై ఏప్రిల్ 4 (మహాప్రభ) : ఓటరు జాబితా పేరు చేర్చుతామంటూ సెల్‌ఫోన్లకు వస్తున్న లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల 23న శాసనసభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేలా ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రంలో చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) పూర్తిచేసి, తుది ఓటరు జాబితా విడుదల చేశారు. అదే సయమంలో, తుది ఓటరు జాబితాలో పేరు లేని అర్హులైన ఓటర్లు, తమ పేరు చేర్చుకునేలా ఇచ్చిన అవకాశం గత నెల 26తో ముగిసింది.

నిర్ణీత గడువులో సుమారు 6 లక్షల మందికి పైగా దరఖాస్తులు సమర్పించారు. ప్రస్తుతం దరఖాస్తులు పరిశీలించి, అర్హులైన వారి పేర్లతో కూడిన ఉప తుది ఓటరు జాబితా ఈ నెల 6న వెలువడే అవకాశముంది. ఈ నేపథ్యంలో, రాష్ట్ర సైబర్‌ క్రైం పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో…. ఓటరు జాబితాలో పేరు చేర్చుతామంటూ సెల్‌ఫోన్లకు లింక్‌లు వస్తున్నాయన్నారు.

ప్రజలు ఈ లింక్‌ క్లిక్‌ చేసి అందులో వచ్చిన వివరాలు పూర్తిచేసే సమయంలో సదరు ఓటరు బ్యాంకు ఖాతా నెంబరు, ఏటీఎం నెంబరు తదితరాలు పూర్తిచేయాలని కోరుతున్నారని, అవి పూర్తిచేసిన తర్వాత ఆయా ఖాతాల్లోని నగదు అపరిచితుల ఖాతాల్లో జమయ్యే అవకాశముందన్నారు. అందువల్ల అలాంటి లింక్‌లను ప్రజలు క్లిక్‌ చేయరాదని, అలాంటి లింక్‌లపై 1930 నెంబరుకు ఫిర్యాదు చేయాలని సైబర్‌ క్రైం పోలీసులు తెలిపారు.