mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 6:04 am Digital Edition : MAHAA PRABHA DAILY

ఒక్క నెలలోనే 73వేల బ్రేక్‌ టికెట్లు అమ్మేశారు

వైసీపీ హయాంలో తిరుమలను అడ్డగోలుగా దోచేశారని, అలాంటి వ్యక్తులు ఇప్పుడు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్ష, కార్యదర్శులు పనబాక లక్ష్మి, దివాకర్‌ రెడ్డి మండిపడ్డారు.

  • వైసీపీ నేతల బండారం బయట పెట్టిన టీడీపీ

తిరుపతి మార్చి 25 మహాప్రభ : వైసీపీ హయాంలో తిరుమలను అడ్డగోలుగా దోచేశారని, అలాంటి వ్యక్తులు ఇప్పుడు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్ష, కార్యదర్శులు పనబాక లక్ష్మి, దివాకర్‌ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం మంగళం రోడ్డులోని టీడీపీ పార్లమెంటు కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు తిరుమలలో సేవా టిక్కెట్లను బ్లాక్‌లో అమ్మేశారు. ఒక్క సెప్టెంబర్‌ నెలలో 73వేల బ్రేక్‌ టిక్కెట్లను విక్రయించగా, వైవీ సుబ్బారెడ్డి పీఎ చిన్నప్పన్న ఒక్క నెలలో 6,432 బ్రేక్‌ టిక్కెట్లు అమ్మేశాడు.అలాగే భూమన కరుణాకర్‌రెడ్డి 6281 బ్రేక్‌ టిక్కెట్లు ఒక నెలలోనే బ్లాక్‌లో అమ్మేశారు. ఇప్పుడు తిరుమలలో ప్రస్తుతం జరుగుతున్న మార్పులను చూసి జీర్ణించుకోలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదవ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ నరసింహ యాదవ్‌ మాట్లాడుతూ జగన్‌ లాంటి అన్నయ్య ఎవ్వరికీ ఉండకూడదని ఆయన చెల్లెలు షర్మిల చెబుతుంటే వైసీపీ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వళ్లించినట్లుగా ఉందన్నారు.

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మబ్బు దేవనారాయణరెడ్డి మాట్లాడుతూ భూమన రౌడీయిజం చేయాలనుకుంటున్నాడని, ఆయన ఉడత బెదిరింపులకు ఎవరూ భయపడరన్నారు. భూమన ఆటలు ఇక సాగనివ్వమని, మరోసారి టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే తరిమికొడతామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు పుష్పావతి యాదవ్‌, ఊట్ల సురేంద్ర నాయుడు, కృష్ణ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.