mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 12 March 2026, 7:27 am Digital Edition : MAHAA PRABHA DAILY

ఐపీఎల్2026 ప్రారంభానికి ముందు ధోనికి భారీ ఊరట

ఐపీఎల్‌ 2026 ప్రారంభానికి ముందు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఊరట లభించింది. బీసీసీఐ నిబంధనను ధోని ఉల్లంఘిస్తున్నాడంటూ దాఖలైన ఫిర్యాదును బీసీసీఐ ఎథిక్స్‌ అధికారి అరుణ్‌ మిశ్రా కొట్టేశారు.

స్పోర్ట్స్ డెస్క్ మార్చి 12 మహాప్రభ  : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్2026) మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ బెంగళూరు, హైదరాబాద్ జట్ల మధ్య జరగనుంది. ఇక ఐపీఎల్2026 ప్రారంభానికి ముందు టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఎంఎస్ ధోనికి భారీ ఊరట లభించింది. క్రికెట్‌కు సంబంధించి పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధనను ధోని ఉల్లంఘిస్తున్నాడంటూ దాఖలైన ఫిర్యాదును బీసీసీఐ ఎథిక్స్‌ అధికారి అరుణ్‌ మిశ్రా కొట్టేశారు.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Super Kings) ఆటగాడిగా ఉంటూనే.. ఓ క్రికెట్‌ అకాడమీతో అనుబంధం కొనసాగిస్తున్నారని 2024లో ధోనిపై ఫిర్యాదు దాఖలైంది. అయితే ధోని ఆ క్రికెట్‌ అకాడమీతో 2017లో ఒప్పందం చేసుకున్నాడు. కానీ, బీసీసీఐ పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన 2018 సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ధోని బీసీసీఐ నిబంధనను ఉల్లంఘించినట్లు కాదని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా అభిప్రాయపడ్డారు. అలాగే ధోని క్రికెట్‌ పరిపాలనలో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే పదవిలో కూడా లేడని ఆయన స్పష్టం చేశారు. అతడు ఐపీఎల్‌లో కేవలం ఆటగాడిగానే కొనసాగుతున్నాడని తెలిపారు.

క్రికెట్ అకాడమీలను కలిగిఉండటం, వాటితో ఒప్పందాలు చేసుకోవడం బీసీసీఐ నిబంధనల ప్రకారం నేరమేమీ కాదని మిశ్రా అభిప్రాయ పడ్డారు. ఫిర్యాదుదారుడు… ధోనితో తనకున్న వ్యక్తిగత, వాణిజ్య వివాదం కారణంగానే ఈ ఫిర్యాదు చేసినట్లుగా కనిపిస్తోందన్నారు. అలాగే ఈ కేసులో ధోని ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆధారాలు లేకపోవడంతో ఫిర్యాదును కొట్టివేస్తున్నామని జస్టిస్ అరుణ్ మిశ్రా పేర్కొన్నారు.