mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 6:08 am Digital Edition : Namastey Mahaaprabha

ఐపీఎల్ 2026: ఘోర ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన రాజస్థాన్

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో 57 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికీ రాజస్థాన్ ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది.

స్పోర్ట్స్ డెస్క్ ఏప్రిల్ 14 (మహాప్రభ) : ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (సోమవారం) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో 57 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రఫుల్‌ హింగే (4 వికెట్లు), సకిబ్‌ హుస్సేన్‌ (4 వికెట్లు) అనే ఇద్దరు అరంగేట్రం పేసర్లు రాజస్థాన్ జైత్రయాత్రకు బ్రేకులు వేశారు. ఈ మ్యాచ్‌లో ఘోర ఓటమిని చవిచూసినప్పటికీ రాజస్థాన్ రాయల్స్ ఓ రికార్డును క్రియేట్ చేసింది.

ఐపీఎల్‌ చరిత్రలో మొదటి 5 వికెట్లు 20 పరుగుల లోపే కోల్పోయిన తర్వాత కూడా 150 పరుగుల మార్క్‌ను దాటిన తొలి జట్టుగా రాజస్థాన్ రికార్డు సృష్టించింది. సన్‌ రైజర్స్‌ నిర్దేశించిన 217 పరుగుల లక్ష్య ఛేదనలో 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి.. పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో గతంలో బెంగళూరు జట్టు పేరిట ఉన్న అత్యుల్ప స్కోర్(49 పరుగుల) రికార్డును బ్రేక్ చేస్తుందేమో అని అంతా భావించారు. అయితే ఆ చెత్త రికార్డు మూటగట్టుకోకుండా జడేజా, ఫెరియెరా ప్రతిఘటించారు. వారిద్దరి పోరాటంతో రాజస్థాన్ 159 పరుగుల వరకు చేరుకోగలింది. ఈ లెక్కన రాయల్స్‌ ఓటమిలోనూ చరిత్ర సృష్టించింది. 20 పరుగుల లోపు ఐదు వికెట్లు కోల్పోయిన ఏ జట్టు 150 పరుగుల మార్కును ఇప్పటి వరకు అందుకోలేదు. ఘోరంగా ఓడినప్పటికీ రాజస్థాన్ 150 మార్క్‌ను అందుకున్న తొలి జట్టుగా నిలిచింది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌.. ఇషాన్‌ కిషన్‌ (91) మెరుపు ఇన్నింగ్స్‌తో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. క్లాసెస్‌ (40) ఓ మోస్తరుగా రాణించగా.. ఆఖర్లో నితీశ్‌ కుమార్‌ రెడ్డి (28),సలీల్‌ అరోరా (24 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించారు. అనంతరం 217 పరుగుల లక్ష్య ఛేదనలో హింగే, సకిబ్‌ ధాటికి రాజస్థాన్‌ రాయల్స్‌ విలవిల్లాడిపోయింది. ఆ జట్టు అతికష్టం మీద 19 ఓవర్లలో 159 పరుగులు చేసి ఆలౌటైంది.