mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 09 May 2026, 12:18 pm Digital Edition : Namastey Mahaaprabha

ఎలుకల మందు తాగి ఆటో నడిపిన డ్రైవర్.. మధ్యలో సడన్‌గా..

కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి ఎలుకల మందు తాగి ఆటో నడిపాడు. మధ్యలో ఆటో వరి కుప్పలను ఢీకొట్టడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే..

సంగారెడ్డి మే 9 ( మహాప్రభ ) : జిల్లాలోని చౌటకూర్ వద్ద జాతీయ రహదారి 161పై శనివారం రోడ్డు ప్రమాదం చోటు జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఎలుకల మందు తాగి ఆటో నడపడం.. ప్రమాదానికి దారితీసింది. మందు ప్రభావంతో ఆటోను కంట్రోల్ చేయలేక రోడ్డు పక్కన ఆరబోసిన వరి కుప్పలను ఢీకొట్టడంతో వాహనం బోల్తా పడింది. సదరు ఆటో డ్రైవర్ గత కొంతకాలంగా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన అతను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని, ఎలుకల మందు తాగి ఆటో నడిపాడు. ఆటో చౌటకూర్ శివారులోకి రాగానే డ్రైవర్ అస్వస్థతకు గురవడంతో వాహనం నియంత్రణ కోల్పోయింది. రోడ్డుపైనే ఉన్న వరి కుప్పలపైకి దూసుకెళ్లడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని డ్రైవర్‌ను బయటకు తీశారు. అతని వద్ద ఉన్న కాగితాలను పరిశీలించగా, తన ఆత్మహత్యాయత్నానికి కారణమైన కొందరు వ్యక్తుల పేర్లను అందులో రాసి ఉన్నట్లు గుర్తించారు. బాధితుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వెంటనే చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి (GGH) తరలించారు. సమాచారం అందుకున్న పుల్కల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు, ఆ లేఖలో ఉన్న వ్యక్తుల వివరాలపై విచారణ చేస్తున్నారు.

 

విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదం

వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయవాడ జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. మితిమీరిన వేగం ఇద్దరు యువతుల జీవితాల్లో విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. వేగంగా వచ్చిన ఒక టయోటా కారు.. ముందు వెళ్తున్న థార్ కారును బలంగా ఢీకొట్టింది. అనంతరం నియంత్రణ కోల్పోయిన టయోటా కారు.. అదే సమయంలో రోడ్డు దాటుతున్న ఇద్దరు యువతులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అంజలి (19) అనే యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో యువతి పూజిత తీవ్రంగా గాయపడటంతో, స్థానికులు ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం..

నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఓ ఇసుక లారీ.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారిపై మినీ ట్రక్కు బోల్తా.. ఒకరి మృతి..

నెల్లూరు జిల్లాలో శనివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. మర్రిపాడు మండలం చుంచులూరు సమీపంలోని 565వ నంబర్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న మినీ ట్రక్కు.. ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో పదిమంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.