mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 11:46 am Digital Edition : MAHAA PRABHA DAILY

ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్.. తెలంగాణకు మచ్చ: బీజేపీ ఎంపీ

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ అభివర్ణించారు.

న్యూఢిల్లీ, మార్చి 11 మహాప్రభ : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ అభివర్ణించారు. ఇది చీకటి రోజు అని పేర్కొన్నారు. బుధవారం పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం, కడియం శ్రీహరిల పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ బుధవారం విచారించారు అనంతరం ఆ పిటిషన్లను ఆయన కొట్టేశారు. ఈ వ్యవహారంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ న్యూఢిల్లీలో స్పందించారు.

ఈ వ్యవహారం సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు సైతం ఇచ్చారని గుర్తు చేశారు. పార్టీ ఫిరాయింపులకు నిర్వచనం ఏమిటంటూ సందేహం వ్యక్తం చేశారు. ఒకరు ఎంపీగా పోటీ చేశారని.. ఇంకొకరు ఎన్నికల్లో ప్రచారం చేశారని గుర్తు చేశారు. గతంలో నైతిక విలువలతో అటల్ బీహార్ వాజపేయి రాజీనామా చేసి, ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల్లో గెలిచారని సోదాహరణగా వివరించారు.పార్టీ మారిన ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వడం తెలంగాణ రాష్ట్రానికి మచ్చ అని అభిప్రాయపడ్డారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ హోల్‌సేల్‌గా.. నేడు కాంగ్రెస్ పార్టీ రిటైల్‌గా వ్యవహరించిందని వ్యంగ్యంగా అన్నారు. రాహుల్ గాంధీకి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉంటే.. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ విధానంపై స్పందించాలని అభిప్రాయపడ్డారు.శాసనసభ స్పీకర్ వ్యవస్థకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించారని విమర్శించారు. దేశానికి తలవంపులు తెచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉందన్నారు. ఇంత గుడ్డిగా వ్యవహరించడం దేని కోసమని సందేహం వ్యక్తం చేశారు. రక్షకులు భక్షకులుగా మారారంటూ బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్ ధ్వజమెత్తారు.