mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 28 February 2026, 7:21 am Digital Edition : Namastey Mahaaprabha

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు.. లక్షల మందికి నగదు పంపిణీ

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ఏపీలో శరవేగంగా సాగుతోంది. 62.76 లక్షల మంది లబ్ధిదారులకు గాను ఇప్పటి వరకు 51.86 లక్షల మందికి పింఛన్లు పంపిణీ అయ్యాయి.

అమరావతి, ఫిబ్రవరి 28 మహాప్రభ : ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల(NTR Bharosa Pension) పంపిణీ శరవేగంగా సాగుతోంది. రేపు(మార్చి1) ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే అంటే ఈరోజు(శనివారం) పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. ఉదయం 11 గంటల నాటికి సుమారు 82 శాతం మేర పింఛన్లు అందజేశారు. ప్రభుత్వం 62.76 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 2,725 కోట్లు విడుదల చేసింది. ఇప్పటి వరకు 51.86 లక్షల మందికి పింఛన్లు పంపిణీ అయ్యాయి. స్వర్ణవార్డు, స్వర్ణగ్రామ సిబ్బంది.. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి నగదుగా అందజేస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం రావివలస గ్రామానికి వెళ్లనున్నారు. అక్కడ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం వారితో ముఖాముఖి నిర్వహించనున్నారు.మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. వృద్ధురాలికి పింఛన్ అందజేసి ఆమె యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలకు జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు ఎస్కేప్ అవ్వడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. అసెంబ్లీ నుంచి ఎస్కేప్, శాసనమండలికి వాకౌట్, రోడ్డుపై రప్పా రప్పా సంస్కృతి వైసీపీదని విమర్శించారు. 2029లో అధికారంలోకి వస్తే రాక్షసత్వం ప్రదర్శిస్తామన్న వైసీపీ వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. మానవత్వంతో పనిచేసే కూటమి ప్రభుత్వమా లేక రాక్షసత్వం గల వైసీపీనా అని ప్రజలు తేడా బేరీజు వేసుకోవాలన్నారు. జగన్.. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోకుండా తప్పిదాలు చేస్తున్నారని తెలిపారు. పురాణకాలంలో యజ్ఞాలను అడ్డుకున్న రాక్షసుల్లా నేడు అభివృద్ధిని, మంచి కార్యక్రమాలను అడ్డుకునే దుష్టశక్తిగా వైసీపీ తయారైందంటూ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యలు చేశారు.