mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 27 February 2026, 11:51 am Digital Edition : Namastey Mahaaprabha

ఈడీ హడావిడి దర్యాప్తు, అరెస్టులతో రాజ్యాంగ హక్కులకు భంగం: సీబీఐ ప్రత్యేక కోర్టు

మనీలాండరింగ్ నిరోధక చట్టం అమలు జరుగుతున్న తీరుపై ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరైట్ హడావిడి దర్యాప్తులు చేయడం, అరెస్టులకు దిగడం రాజ్యాంగ హక్కులకు విరుద్ధమవుతుందని పేర్కొంది.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 మహాప్రభ: మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) అమలు జరుగుతున్న తీరుపై ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరైట్ (Enforcement Directorate) హడావిడి దర్యాప్తులు చేయడం, అరెస్టులకు దిగడం రాజ్యాంగ హక్కులకు విరుద్ధమవుతుందని పేర్కొంది. ప్రాథమిక నేరం నిరూపించకముందే పీఎంఎల్ఏ కింద అరెస్ట్ చేసి, దీర్ఘకాలం జైలులో ఉంచరాదని ప్రత్యేక న్యాయమూర్తి (పీసీ చట్టం) జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.

సీబీఐ అధికారిపై డిపార్ట్‌మెంట్ చర్యలు

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి సిసోడియాతో సహా నిందితులందరికీ రౌస్ ఎవెన్యూ కోర్టు శుక్రవారం నాడు క్లీన్ చిట్ ఇచ్చింది. సీబీఐ ఛార్జిషీటులో మెరిట్ లేదంటూ కేసు నుంచి 23 మంది నిందితులకు విముక్తి కల్పించింది. ఢిల్లీ ఎక్సైజ్ కేసును ఇన్వెస్టిగేట్ చేసిన సీబీఐ అధికారిపై డిపార్ట్‌మెంట్ పరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా పీఎంఎల్ఏ కింద కేసులపై ప్రత్యేక న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రాథమిక నేరం లేకపోతే మనీలాండరింగ్ కేసు నిలువదంటూ సుప్రీంకోర్టు తీర్చునిచ్చిన విషయాన్ని ప్రత్యేక న్యాయమూర్తి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముందస్తు నిర్బంధం శిక్షలా మారకూడదని అన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛకు రాజ్యంగం హామీ ఇచ్చిందని, అది చట్టపరమైన సమతుల్యతతోనే పరిమితం చేయాలని అన్నారు. న్యాయం అనేది సులభమైన కథనాన్ని అనుసరించదని, సాక్ష్యాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటుదని స్పష్టం చేశారు.