టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్.. వైభవ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. అతడిని డెమీ గాడ్‌గా అభివర్ణిస్తూ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌కు కీలక విజ్ఞప్తి చేశాడు. అర్జంట్‌గా వైభవ్‌ను జాతీయ జట్టులోకి తీసుకోవాలని కోరాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్‌ను ‘గాడ్ ఆఫ్ క్రికెట్’ అని పిలుస్తుంటారు. అతడి తర్వాత కొత్త తరం నుంచి మరో సంచలనం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకుని ఔరా అనిపించాడు 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. 14 ఏళ్లకే రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగి.. ఆడిన మూడో మ్యాచులోనే సెంచరీ బాదేశాడు. ఆ తర్వాత తిరిగి చూసుకుందే లేదు.. అండర్ 19 ప్రపంచ కప్, ఆసియా కప్ రైజింగ్స్ స్టార్స్, ప్రస్తుతం ఐపీఎల్ 2026 వరకు అద్భుతమైన ఫామ్‌తో అదరగొడుతున్నాడు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్.. వైభవ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. అతడిని డెమీ గాడ్‌గా అభివర్ణిస్తూ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌కు కీలక విజ్ఞప్తి చేశాడు.
‘వైభవ్‌ను అర్జంట్‌గా భారత జట్టులోకి తీసుకోవాలి. ఇలాంటి ప్రతిభ చాలా అరుదుగా వస్తుంటుంది. ఆలస్యం చేయకుండా జట్టులోకి తీసుకోవాలని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌కు విజ్ఞప్తి చేస్తున్నా. ప్లేయింగ్ ఎలెవన్‌లో కాకపోయినా.. 15 మంది స్వ్కాడ్‌లో అయినా అతడిని తీసుకోవాలి. ఎందుకు? అని ప్రశ్నిస్తే నా దగ్గర చాలా సమాధానాలు ఉన్నాయి. ప్రపంచ మేటి బౌలర్ బుమ్రా వేసిన తొలి బంతికే సిక్సర్ కొట్టగలడు. హేజిల్‌వుడ్ లాంటి బౌలర్లను లెక్క చేయడు. మ్యాచ్‌ను ఒంటి చేత్తో గెలిపించే సత్తా వైభవ్ సూర్యవంశీకి ఉంది’ అని క్రిస్ కొనియాడాడు.
అందుకే సచిన్ క్రికెట్ దేవుడయ్యాడు..
1989లో తాను భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పుడే సచిన్ అరంగేట్రం చేశాడని క్రిస్ శ్రీకాంత్ గుర్తు చేసుకున్నాడు. ‘అప్పుడు సచిన్‌కు 16 ఏళ్లు. అప్పుడే క్రికెట్ అరంగేట్రం చేశాడు. ముందుగానే భారత జట్టులోకి తీసుకురావడం వల్ల అద్భుత ప్రదర్శనలు చేసి ‘గాడ్ ఆఫ్ క్రికెట్’ అయ్యాడు. అలాగే సూర్యవంశీ కూడా భవిష్యత్తులో డెమీ గాడ్‌గా మారే అవకాశం ఉంది’ అని తెలిపాడు. ఇప్పటికే ఐపీఎల్ 2026 తర్వాత ఐర్లాండ్ టూర్‌కు ఎంపిక చేయబోయే భారత జట్టు షార్ట్ లిస్ట్‌లో సూర్యవంశీ పేరు ఉన్నట్టు సమాచారం. ఈ కుర్రాడిపై సెలక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.