mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 04 March 2026, 7:20 am Digital Edition : MAHAA PRABHA DAILY

ఇరాన్ యుద్ధం.. పెరగనున్న వంటింటి బడ్జెట్..

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడి భారత ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. ఈ యుద్ధంతో చమురు ధరలు కొండెక్కి వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణం భారీగా పెరిగే ప్రమాదం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థపై ఈ యుద్ధ ప్రభావం ఈ నెల నుంచే ప్రారంభమవుతుందని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు.

మార్చి 4 మహాప్రభ : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడి భారత ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. ఈ యుద్ధంతో చమురు ధరలు కొండెక్కి.. వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణం భారీగా పెరిగే ప్రమాదం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థపై ఈ యుద్ధ ప్రభావం ఈ నెల నుంచే ప్రారంభమవుతుందని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ సెగ సామాన్యులకు కూడా త్వరగానే తగలబోతోంది. హోర్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేయడంతో ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి (Iran war impact on India).హోర్ముజ్‌ జలసంధిని మూసివేయడం మన వంటింటికి కూడా తీవ్ర ఇబ్బందులను కలిగిస్తుందనడంలో సందేహం లేదు. మనకు అవసరమైన సోయా, సన్‌ ఫ్లవర్‌ వంటి వంట నూనెలు, పప్పు దినుసులను ఇతర దేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకుంటున్నాం. అర్జెంటీనా, బ్రెజిల్‌, అమెరికా నుంచి సోయా ఆయిల్, ఉక్రెయిన్‌, రష్యాల నుంచి సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ దిగుమతవుతున్నాయి (kitchen budget India).వంట నూనెలను తీసుకొచ్చే నౌకలు సూయజ్‌ కెనాల్‌, హోర్ముజ్‌ జలసంధి మీదగా రావాలి. ఇరాన్‌ ఇప్పటికే హోర్ముజ్‌ జలసంధిని మూసివేసింది. దీంతో వీటిని తీసుకొచ్చే నౌకలు మరింత దూరం ప్రయాణించి మన రేవులకు చేరాలి. దీంతో రవాణా ఖర్చులు భారీగా పెరిగి మన వంటింటి బడ్జెట్ మీద తీవ్ర ప్రభావం పడనుంది. అలాగే ముడిచమురు దిగుమతుల ప్రభావం వల్ల వంట గ్యాస్ ధరలు కూడా భారీగా పెరిగే ప్రమాదం కనిపిస్తోంది (LPG price rise India).

ఇక, మనదేశం ప్రతి ఏటా 5-6 మిలియన్ టన్నుల మేర కందిపప్పు, పెసరపప్పు వంటి పప్పు ధాన్యాలను మయన్మార్, కెనడా, ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకుంటోంది. హోర్ముజ్ జలసంధి స్థంభించిన కారణంగా వీటిని తీసుకొచ్చే నౌకలు కూడా మరో మార్గంలో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఫలితంగా రవాణా ఖర్చులు, బీమా ఖర్చులు భారీగా పెరిగి వాటి ప్రభావం రిటైల్ కొనుగోలుదారులపై కూడా పడుతుంది (Household expenses India).అలాగే మనం వాడే జీడిపప్పు, పిస్తా, ఎండు ద్రాక్ష, ఆప్రికాట్ వంటి డ్రైఫ్రూట్స్, నట్స్ ధరలు కూడా భారీగా పెరిగే ప్రమాదముంది (Grocery price rise). వీటిని ఎక్కువగా ఇరాన్, అఫ్గానిస్థాన్ నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఇరాన్‌ యుద్ధంలో తలమునకలై ఉంది. మరోవైపు అఫ్గానిస్థాన్ కూడా పాకిస్థాన్‌తో తలపడుతోంది. ఈ నేపథ్యంలో వీటి దిగుమతులు కూడా ప్రభావితమవుతాయి. ఏదేమైనా హోర్ముజ్ జలసంధి ఎంత త్వరగా తెరుచుకుంటే మన దేశవాసులు అంత త్వరగా ఊపిరిపీల్చుకోగలుగుతారు.