mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 01 April 2026, 5:12 am Digital Edition : Namastey Mahaaprabha

ఇండిగో కొత్త సీఈఓగా విలియం వాల్ష్‌

దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగో తమ కొత్త ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ)ని నియమించింది. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ (ఐఏటీఏ) చీఫ్‌గా పని చేస్తున్న విలియం వాల్ష్‌ను తమ కొత్త సీఈవోగా ఇండిగో ప్రకటించింది.

ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 1 (మహాప్రభ) : దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో(Indigo), బ్రిటీష్ ఎయిర్ వేస్ మాజీ అధిపతి విలియం వాల్ష్‌ను తమ కొత్త ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ)గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఆయన ప్రస్తుతం అంతర్జాతీయ విమాన రవాణా సంఘం (ఐఏటీఏ) డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు. రెగ్యులేటర్ ఆమోదాలకు లోబడి వాల్ష్‌ను సీఈఓగా నియమిస్తున్నట్లు ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. ఐఏటీఏలో ఆయన పదవీకాలం జూలై 31తో ముగుస్తుందని, ఆగస్టు 3 లోపు ఆయన విధుల్లో చేరతారని ఆశిస్తున్నట్లు ఇండిగో పేర్కొంది.

గత ఏడాది డిసెంబరులో ఇండిగో కార్యకలాపాల్లో తీవ్ర అంతరాయాలు చోటుచేసుకున్న నేపథ్యంలో.. సంస్థ సీఈఓ బాధ్యతల నుంచి పీటర్‌ ఎల్బర్స్‌ వైదొలిగారు. అనంతరం మూడు వారాల్లోపే ఈ ప్రకటన వెలువడింది. విమానయాన రంగంలో వాల్ష్‌కు చాలా అనుభవం ఉంది. గతంలో బ్రిటిష్‌ ఎయిర్‌వేస్, ఐఏజీ (ఏరో లింగస్, బ్రిటిష్‌ ఎయిర్‌వేస్, ఐబేరియా, లెవల్, వ్యూలింగ్‌లను కలిగి ఉన్న హోల్డింగ్‌ కంపెనీ) సీఈఓగా వాల్ష్ పనిచేశారు. ఆయన్ను విల్లీ అని కూడా పిలుస్తుంటారు.

తాము విల్లీని సీఈవోగా ప్రకటించినప్పటికీ నియామకానికి నియంత్రణ సంస్థల అనుమతులు లభించాల్సి ఉంటుందని ఇండిగో తెలిపింది. వాల్ష్‌ నియామకానికి ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ బోర్డు మంగళవారం ఆమోదం తెలిపింది. ఇండిగో సీఈఓగా వాల్ష్‌ సంస్థ మొత్తం నిర్వహణ, వ్యూహాత్మక నిర్ణయాలకు బాధ్యత వహించనున్నారు. ఇండిగో 2006 ఆగస్టులో కార్యకలాపాలు ప్రారంభించిగా.. ఆ సంస్థకు వాల్ష్‌ మూడో విదేశీ సీఈఓ.

ఇండిగో మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా మాట్లాడుతూ.. ‘ వాల్ష్ ఒక ప్రఖ్యాత, నిష్ణాతుడైన విమానయాన నాయకుడు. ప్రపంచ దృక్పథం, వినియోగదారులను కేంద్రంగా చేసుకుని బలమైన విమానయాన సంస్థలను నిర్మించిన కార్యాచరణ నైపుణ్యం ఆయన సొంతం. విలువలతో కూడిన నాయకత్వం వంటి లక్షణాలను ఆయన కలిగి ఉన్నారు. ఈ కీలకమైన వృద్ధి దశలో ఇండిగోకు నాయకత్వం వహించడానికి ఈ లక్షణాలన్నీ ఆయన్ను అర్హునిగా నిలుపుతున్నాయి’ అని భాటియా తెలిపారు. ఇండిగోకు నాయకత్వం వహించే అవకాశం రావడం పట్ల వాల్ష్‌ సంతోషం వ్యక్తం చేశారు.