mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 29 April 2026, 6:08 am Digital Edition : Namastey Mahaaprabha

ఆస్తి కోసం కూతురు ఎంతకు తెగించిందంటే..

చిలకలూరిపేటలోని గుర్రాల చావిడి ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి వివాదం కారణంగా తల్లిదండ్రులపై కూతురు కర్కశంగా వ్యవహరించింది.

పల్నాడు జిల్లా ఏప్రిల్ 29 (మహాప్రభ) : చిలకలూరిపేటలోని గుర్రాల చావిడి ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి వివాదం కారణంగా తల్లిదండ్రులపై కూతురు కర్కశంగా వ్యవహరించింది. కన్న తల్లిదండ్రులను కూతురు చంపాలని చూడటం చర్చనీయాంశంగా మారింది. చిలకలూరిపేటకు చెందిన తల్లిదండ్రులు, కూతురికి మధ్య ఆస్తి విషయాల్లో తరచూ గొడవలు జరుతున్నాయి. ఆస్తిని ఇచ్చేందుకు తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో కోపం పెంచుకున్న కూతురు.. వారి ప్రాణాలు తీయడానికి సిద్ధమైంది.

గత రాత్రి తల్లిదండ్రులు ఉంటున్న ఇంటికి కూతురు నిప్పు పెట్టింది. మంటలను గుర్తించిన తల్లిదండ్రులు సకాలంలో ఇంటి నుంచి బయటకు వచ్చేయడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మంటలు వ్యాపించడంతో ఇంట్లోని ఫర్నిచర్, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కూతురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులు ఉంటున్న ఇంటికి కూతురు నిప్పు పెట్టిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.