mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 29 April 2026, 6:04 am Digital Edition : Namastey Mahaaprabha

ఆండ్రీ రస్సెల్ రికార్డును బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ

ఐపీఎల్‌ 2026లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్యవంశీ త‌న రికార్డుల వేట‌ను కొన‌సాగిస్తున్నాడు. నిన్న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో రికార్డును సృష్టించాడు.

స్పోర్ట్స్ డెస్క్ ఏప్రిల్ 29 (మహాప్రభ) : ఐపీఎల్‌ 2026లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ చిచ్చర పిడుగు వైభ‌వ్ సూర్యవంశీ త‌న రికార్డుల వేట‌ను కొన‌సాగిస్తున్నాడు. నిన్న( మంగ‌ళ‌వారం) ముల్లాన్‌పూర్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో వైభ‌వ్ చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. అర్ష్‌దీప్ సింగ్‌, లాకీ ఫెర్గూస‌న్ వంటి వ‌ర‌ల్డ్ క్లాస్ బౌల‌ర్లపై చెలరేగి ఆడాడు. ఈ యువ సంచలనం కేవ‌లం 16 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 43 ప‌రుగులు చేశాడు. ఈ సీజ‌న్‌లో వైభ‌వ్ 400 ప‌రుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ దిగ్గజం ఆండ్రీ రస్సెల్ పేరిట ఉన్న ఓ రికార్డును వైభ‌వ్ బద్దలు కొట్టాడు. మరి.. ఆ వివరాలు ఏమిటోఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్ చరిత్రలో ఒక సీజ‌న్‌లో అత్యంత వేగంగా 400 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు. ఈ ఫీట్‌ను కేవ‌లం 167 బంతుల్లోనే వైభవ్ అందుకున్నాడు. గతంలో ఈ రికార్డు కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ స్టార్ ప్లేయర్ ఆండ్రీ ర‌స్సెల్ పేరిట ఉండేది. 2019 సీజ‌న్‌లో ర‌స్సెల్ 188 బంతుల్లో 400 ప‌రుగులు సాధించాడు. తాజా మ్యాచ్‌తో ర‌స్సెల్‌ను వైభ‌వ్ అధిగమించాడు. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ వంటి దిగ్గజాలకు కూడా ఈ రికార్డును అందుకోలేదు.

అలానే ఒకే సీజ‌న్‌లో 400 పైగా పరుగులు చేసిన పిన్న వ‌య‌ష్కిడిగా తిల‌క్ వ‌ర్మ పేరిట ఉన్న రికార్డును వైభ‌వ్ బ‌ద్దలు కొట్టాడు. తిల‌క్ 20 ఏళ్ల వ‌య‌స్సులో ముంబై ఇండియ‌న్స్ త‌ర‌పున 2023 సీజ‌న్‌లో ఈ ఫీట్‌ను సాధించాడు. తాజాగా ఈ రికార్డును వైభ‌వ్ బ్రేక్ చేశాడు. ఇక ఓవ‌రాల్‌గా ఈ ఏడాది సీజ‌న్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన వైభ‌వ్‌.. 238.10 స్ట్రైక్ రేటుతో 400 ప‌రుగులు చేశాడు.