mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 11:50 am Digital Edition : MAHAA PRABHA DAILY

అసెంబ్లీలో మైనింగ్ అంశంపై వాడివేడి చర్చ… హరీశ్ రావు సంచలన ఆరోపణలు

మైనింగ్ అంశంపై తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌పై ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. మైనింగ్ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని హరీశ్ డిమాండ్ చేశారు.

హైదరాబాద్, మార్చి 28 (మహాప్రభ) : తెలంగాణ అసెంబ్లీలో మైనింగ్ అంశంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘కంచె చేను మేసినట్లు… రక్షకుడే భక్షకుడిలా మారినట్లు అక్రమ మైనింగ్ జరుగుతోంది’ అని విమర్శించారు. నగరం నడిబొడ్డున అక్రమ మైనింగ్ జరుగుతోందని.. రాఘవ కన్స్ట్రక్షన్స్ నడుపుతున్న క్రషర్లకు ఎలాంటి అనుమతులు లేవని ఆయన ఆరోపించారు. క్రషర్ నడపాలంటే 8 రకాల అనుమతులు కావాలని.. కానీ నిబంధనలు పాటించకుండా నడుపుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి కోట్ల రూపాయలు గండిపడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. మైనింగ్ శాఖ ఇప్పటికే షోకాజ్ నోటీసులు, డిమాండ్ నోటీసులు ఇచ్చినా చర్యలు జరగడం లేదని మాజీ మంత్రి తెలిపారు. అనుమతులు లేని క్రషర్‌ను మూసివేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు మైనింగ్ శాఖ లేఖ రాసినా ఎలాంటి చర్యలు లేవని మాజీ మంత్రి వ్యాఖ్యలు చేశారు.

ఒక క్రషర్ కంపెనీ వల్ల కాలుష్యం పెరుగుతోందని ట్వీట్ పెట్టానని.. ఈ ట్వీట్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారని సభలో హరీశ్ తెలిపారు. ‘విచారణ జరిపిస్తారని అన్నారు మంచిదే. పొంగులేటి మంత్రిగా ఉన్నప్పుడు విచారణ జరపడం పద్ధతి కాదు. మంత్రి పదవికి పొంగులేటి రాజీనామా చేసిన తర్వాత విచారణ జరిపించాలి’ అని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. ‘నాకు పొంగులేటి మంచి మిత్రుడు. ఆయన, నేను కలిసి పనిచేశాం. నాకు వ్యక్తిగత ఉద్దేశాలు లేవు. గతంలో మేం తప్పులు చేశాం కాబట్టి మీరు తప్పులు చేస్తామనడం మంచిది కాదు. ఓబుళాపురం మైన్స్‌పై కూడా సభలో చర్చ జరిగింది. ఓబుళాపురం మైన్స్ విషయంలో హౌస్ కమిటీ వేశారు. ఆరోపణలు చేసిన నాగం జనార్ధన్ రెడ్డిని హౌస్ కమిటీకి హెడ్‌గా పెట్టారు. తప్పు చేయకపోతే హౌస్ కమిటీ వేయండి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి’ అంటూ హరీశ్ రావు పట్టుబట్టారు.

మంత్రి శ్రీధర్ బాబు సీరియస్

హరీశ్ రావు వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. హరీశ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. ‘విచారణ కోరారు… జరిపిస్తామని అన్నాం.. ఇంకా ఏంటి. మంత్రి పేరు ఎలా తీసుకుంటారు. హరీశ్ రావు చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి. మంత్రి ఎందుకు రాజీనామా చేయాలి. అడ్డగోలు ఆరోపణలు సరికాదు. హరీశ్ మాటలు రికార్డ్ నుంచి తొలగించాలి’ అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

మంత్రి పొంగులేటిని టార్గెట్ చేస్తున్నారు: సీతక్క

హరీష్ రావు అసలు ఉద్దేశం ఏంటో చెప్పాలని మంత్రి సీతక్క అన్నారు. కేసీఆర్ హయాంలో 40 క్రషర్లకు పర్మిషన్ ఇచ్చారని గుర్తుచేశారు. కావాలని మంత్రి పొంగులేటిని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా మంత్రుల పేర్లు తీస్తున్నారన్నారు. పదేళ్ల అక్రమాలపై విచారణ చేయాలని మంత్రి సీతక్క అన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. పదేళ్లు జరిగిన మైనింగ్‌పై విచారణ జరిపిద్దామన్నారు. పదేళ్ల అడ్డగోలుగా ఇసుక దోపిడి చేశారని ఆరోపించారు. తప్పు చేసిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. హరీశ్ రావు కోరినట్లు హౌస్ కమిటీ అడగడం సరికాదని.. విచారణ జరిపి తామే చర్యలు తీసుకుంటామని మంత్రి వివేక్ స్పష్టం చేశారు. సాండ్ మాఫియాలో దళితులను కొట్టినప్పుడు ఎందుకు హౌస్ కమిటీ వేయలేదని వివేక్ ప్రశ్నించారు.

హరీశ్ నీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకో: మంత్రి శ్రీధర్

వెంటనే మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. క్రషన్ కంపెనీకి సంబంధించి చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారని.. కానీ బీఆర్ఎస్ వెనక్కి పోతోందన్నారు. మంత్రి శ్రీనివాస్ రెడ్డిపై వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆ కంపెనీలో మంత్రి డైరెక్టర్ కాదని.. చైర్మన్ కాదని.. ఆ కంపెనీతో మంత్రికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వారి కుటుంబ సభ్యులకు వ్యాపారం ఉంటే తప్పా అని ప్రశ్నిస్తూ.. ఆ కంపెనీ తప్పు చేస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

తప్పయితే ఉరిశిక్ష వేయండి.. హరీశ్ సవాల్

ఈ క్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావు సభలో సంచలన కామెంట్స్ చేశారు. తన వ్యాఖ్యలు తప్పయితే ఉరిశిక్ష వేయాలని సవాల్ విసిరారు. వ్యాపారం చేయడం తప్పు కాదని… కానీ మైనింగ్ లైసెన్స్ లేకుండా క్రషర్ నడపడం తప్పన్నారు. క్రషర్‌కు రాష్ట్ర పొల్యూషన్ బోర్డు అనుమతి ఇవ్వాలని.. కేంద్ర పర్యావరణ అనుమతులు అవసరం లేదని హరీశ్ వెల్లడించారు. వెంటనే ప్యానెల్ స్పీకర్ బాలు నాయక్ స్పందిస్తూ.. ‘హరీష్ రావు మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి’ అని కోరారు. వెంటనే హరీశ్‌ రావు మైక్ కట్‌ చేసిన స్పీకర్.. బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో పాల్వాయి హరీశ్ మాట్లాడుతుండగా సభలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. మైనింగ్ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఈ చర్చతో అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.