mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 17 February 2026, 7:23 am Digital Edition : Namastey Mahaaprabha

అర్ధరాత్రి మిరప దొంగలు..

మండలంలోని పాల్తూరు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు మిరపకాయల చోరీకి పాల్పడ్డారు. రైతులు తెలిపిన మేరకు గ్రామానికి చెందిన వై. నాగరాజు రెండెకరాలు కౌలుకు తీసుకుని గుంటూరు కారం మిరపకాయలను సాగు చేశాడు.

విడపనకల్లు(అనంతపురం) ఫిబ్రవరి 17 మహాప్రభ : మండలంలోని పాల్తూరు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు మిరపకాయల చోరీకి పాల్పడ్డారు. రైతులు తెలిపిన మేరకు గ్రామానికి చెందిన వై. నాగరాజు రెండెకరాలు కౌలుకు తీసుకుని గుంటూరు కారం మిరపకాయలను సాగు చేశాడు. ఎండిన కాయలను కోతలు కోయించి పొలంలోనే ఆరబెట్టుకున్నాడు. ఆదివారం శివరాత్రి కావటంతో తన అమ్మనాన్నాలు సుంకమ్మ, అంజినయ్యను పొలంలో కాపలా పెట్టి వారికి రాత్రి భోజనాలు ఇచ్చి ఇంటికి వెళ్లాడు. వారు నిద్రలోకి జారుకోగానే నలుగురు వ్యక్తులు ముసుగులు వేసుకుని వచ్చి మిరప కాయలను సంచులకు నింపడం ప్రారంభించారు.శబ్దం రావడంతో మేల్కొన్న ఆ వృద్ధులు అరిచే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన దొంగలు వెంటనే వారి మెడపై వేటకొడవళ్లు ఉంచి, అరిస్తే చంపుతామని బెదిరించారు. అనంతరం ఐదు సంచులకు మిరపకాయలు నింపుకొని పరారయ్యారు. దీంతో తనకు రూ.లక్ష వరకు నష్టం వచ్చినట్లు నాగరాజు సోమవారం పాల్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇతని పొలం ఉరవకొండకు వెళ్లే దారికి వంద మీటర్లు దూరంలో ఉండటం గమనార్హం. మరో రైతు శ్రీనివాసులు ఆదివారం అర్ధరాత్రి 1 గంట సమయంలో సాగు చేసిన మిరప పొలం వద్దకు వెళ్లాడు. అప్పటికే సాళ్లలో మిరప కాయలు మాయం అయినట్లు గుర్తించాడు.

దాదాపుగా 20 సాళ్లలో 10 క్వింటాళ్లకు పైగా మిరపకాయలను కోసుకెళ్లారని, దీంతో తనకు రూ.2.5లక్షల నష్టం సంభవించినట్లు బాధితుడు బోరుమన్నాడు. ఇంకో రైతు బాషా పొలంలోని మిరప రాశుల వద్ద ఏడుగురు దొంగలు మిరప కాయలు దోచుకెళ్లేందుకు వెళ్లారు. అక్కడ ఉన్న ఇద్దరు రైతులు వారిని గమనించి కేకలు వేశారు. దీంతో పక్క పొలాల రైతులు అక్కడికి చేరుకుని దొంగలను పట్టుకునేందుకు యత్నించారు. దొంగల వద్ద మారణాయుధాలు ఉన్నట్లు రైతులు పేర్కొన్నారు.

సిబ్బంది లేరు…

స్టేషన్‌లో సిబ్బంది లేరు. నేను ఒక్కడినే ఏమి చేయగలను. గ్రామాల్లో దండోర వేయించా. ఆదివారం రాత్రి జరిగిన విషయాలు అన్ని నాదృష్టికి వచ్చాయి. బాషా పొలంలోకి వచ్చిన ఏడుగురు తప్పించుకున్నారు అని రైతులు తెలిపారు. శ్రీనివాసులు పొలం మా లిమిట్స్‌లోకి రాదు. అది బొమ్మనహాళ్‌ మండలంలోకి వస్తుంది. వై నాగరాజు ఫిర్యాదు చేశాడు. వాళ్ల అమ్మనాన్నలను వేట కొడవళ్లతో బెదిరించి రెండు క్వింటాళ్లు పైనే కాయలను నింపుకుని వెళ్లారని తెలిసింది. చర్యలు తీసుకుంటాం.

-మురహరి బాబు, ఎస్‌ఐ, పాల్తూరు