mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 12:18 pm Digital Edition : Namastey Mahaaprabha

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్లకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాజధాని ప్రాంతంలోని క్వాంటం వ్యాలీలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించతలపెట్టిన ట్విన్ ఆఫీస్ టవర్ల నిర్మాణానికి అధికారికంగా పరిపాలన అనుమతులు లభించాయి.

అమరావతి మే 2 ( మహాప్రభ ) : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) అభివృద్ధిలో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాజధాని ప్రాంతంలోని క్వాంటం వ్యాలీలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించతలపెట్టిన ట్విన్ ఆఫీస్ టవర్ల నిర్మాణానికి అధికారికంగా పరిపాలన అనుమతులు లభించాయి. రాజధాని నగరంలో మౌలిక సదుపాయాల కల్పన, పరిపాలనా యంత్రాంగానికి అవసరమైన కార్యాలయాల కోసం ఈ ట్విన్ టవర్లను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోంది. ట్విన్ టవర్ల (T1 & T2) ‘షెల్ అండ్ కోర్’ (Shell and Core) నిర్మాణ పనుల కోసం రూ. 1208.41 కోట్లు కేటాయిస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల (ఏప్రిల్) 23వ తేదీన జరిగిన 60వ ఏపీసీఆర్‌డీఏ (APCRDA) అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నిధులను మంజూరు చేసింది.

టెండర్ల విధానం..

ఈ ప్రాజెక్టును ‘డిజైన్ బిల్డ్ లంప్సమ్’ పర్సంటేజ్ టెండర్ విధానంలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల నిర్మాణ సంస్థ ప్లానింగ్, డిజైనింగ్, ఎగ్జిక్యూషన్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. ఈ భారీ నిర్మాణ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (AGICL)ను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ప్రాజెక్టు పర్యవేక్షణ, అమలు బాధ్యతలను ఏజీఐసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్‌కు అప్పగిస్తూ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ప్రాధాన్యం..

క్వాంటం వ్యాలీ ప్రాంతంలో ఈ టవర్లు రావడం వల్ల ఐటీ, పరిపాలన, వాణిజ్య రంగాలు మరింత వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉంది. అమరావతిని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే క్రమంలో ఇవి ఐకానిక్ కట్టడాలుగా నిలవనున్నాయి. అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచిన ఏపీ ప్రభుత్వం రూ. 1208.41 కోట్లకు పైగా నిధులతో ట్విన్ టవర్ల నిర్మాణానికి పచ్చజెండా ఊపడం రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్, అభివృద్ధి పనులకు కొత్త ఊపునిస్తోంది.