mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 23 February 2026, 6:58 am Digital Edition : Namastey Mahaaprabha

అనూరియా కేసులో నలుగురికి చేరిన మృతులు.. జిల్లా కలెక్టర్

నగరంలో అనూరియా వ్యాధితో మరణించిన వారి సంఖ్య నలుగురికి చేరిందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి వెల్లడించారు. నగరంలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో 12 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 23 మహాప్రభ : నగరంలో అనూరియా వ్యాధితో ఆసుపత్రుల్లో మరణించిన వారి సంఖ్య నలుగురికి చేరిందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి వెల్లడించారు. నగరంలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో 12 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి మీడియాతో మాట్లాడుతూ.. ఇంటింటా సర్వే నిర్వహించి 73 శాంపిల్స్ సేకరించామని వివరించారు. అలాగే పాలు వ్యాపారికి చెందిన 42 గేదెల నుంచి పాలు సేకరించి.. ఆ శాంపిల్స్‌ను హైదరాబాద్ లాబరేటరీలకు పంపామన్నారు. రాజమహేంద్రవరంలో చోటు చేసుకున్న అనూరియా (మూత్రం నిలిచిపోవడం)పై జిల్లా ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన అంశాలను ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు.రాజమహేంద్రవరంలోని లాలాచెరువు సమీపంలోని చౌడేశ్వరినగర్‌ పరిసర ప్రాంతాల్లో ఫిబ్రవరి 15వ తేదీ నుంచి వాంతులు అవ్వడం, మూత్ర విసర్జన కాకపోవడం, కడుపు ఉబ్బరం తదితర సమస్యలతో వరుసగా 14 మంది నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చేరారు. వీరిలో బి. కనకరత్నం (76), తాడి కృష్ణవేడి (75) ఇప్పటికే మరణించారు. ఇక ఈ బాధితుల్లో 60 ఏళ్లు పైబడిన వారే అధికంగా ఉన్నారు. 5 నెలల శిశువుతోపాటు మూడేళ్ల బాలుడు సైతం ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనారోగ్యానికి గురవడంతో వారు.. అధికారులకు సమాచారం ఇచ్చారు.దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే అనూరియా బారిన పడిన వారందరికి ఒకే వ్యక్తి పాలు పోస్తున్నట్లు వైద్యధికారులకు బాధితులు వెల్లడించారు. దీంతో పాలు కల్తీ జరిగి ఉండవచ్చని వారు సందేహం వ్యక్తం చేశారు. శివరాత్రి అంటే.. ఫిబ్రవరి 15వ తేదీన పాలు,పెరుగు చేదుగా అనిపించాయని బాధితులు వివరించారు. దీంతో పాల వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే బాధితుల రక్త, మూత్ర నమూనాలను ల్యాబ్‌కు పంపారు. ఆ నమూనాలకు నివేదికలు అందాల్సి ఉందని వైద్యులు వెల్లడించారు. ఇందులో కొత్త కేసులేవి నమోదు కాలేదని డీఎంహెచ్‌వో వెల్లడించారు.

జిల్లా ఎస్పీ రియాక్షన్..

అనూరియా వ్యాధిపై విజయవాడ నుంచి ప్రత్యేక క్లూస్ టీమ్స్‌తో విచారణ చేపట్టామని జిల్లా ఎస్పీ నర్సింహ కిశోర్ వెల్లడించారు. మృత మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించామన్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా నిందితులపై కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు.

కాల్ సెంటర్ ఏర్పాటు..

అనూరియ కేసులపై సమాచారం కోసం ప్రభుత్వం కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఈ వ్యాధి అనుమానిత లక్షణాలు ఉన్న వారు ఈ కాల్ సెంటర్‌‌లో ఏర్పాటు చేసిన 9494060060 నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించింది.